మెరగు చెంగట నున్న మేఘంబు కైవడి
ఉవిద చెంగట నుండ నొప్పు వాడు
చంద్ర మండల సుధా సారంబు పోలిక
ముఖమున చిరునవ్వు మొలచువాడు
వల్లీ యుత తమాల వసుమతీజము భంగి
పలు విల్లు మూపున వరగువాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘన కిరీటము తల గల్గువాడు
పుండరీక యుగము బోలు కన్నులవాడు
వెడద యురము వాడు విపుల భద్ర మూర్తి
వాడు రాజ ముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గాన బడియె
- పోతన భాగవతము