రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో
పసిడి గిన్నెల నుగ్గు పాలు తాగి
సోమయాజుల వారి హొమ వేదికలపై
అల్లారు ముద్దుగా ఆటలాడి
శ్రీనాధుల సువర్ణ సీస మాలికలలో
హాయిగా తూగు టుయ్యాలలూగి
భాగవతుల వారి పంచ పాళీలలో
మెత్తని శయ్యల నొత్తిగిల్లి
విజయ విద్యానగర రాజ వీధులందు
దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి
కంచు జయభేరి దెస లందు మ్రోగించిన
ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు
- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి