ఈ మధ్య కాలములో నేను చేసిన సమస్యా పూరణలు క్రింద యిస్తున్నాను.
సమస్య: తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై
ఉత్పలమాలలో ఉన్నపై సమస్యకు రామాయణపరముగా నా పూరణ:
దమ్మున పోరుచున్న ఘన దర్ప సహోదరులందు అగ్రజున్
రొమ్మున బాణ మేసి రఘురాముడు చాటుగ వాలి గూల్చినన్
రమ్ము మదీయ బాహు పరిరంభము చేకొనుమంచు భర్తకున్
తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై
ఇదే సమస్యకు సామాన్య అర్ధములో నా పూరణ:
అమ్మయు నాన్న లేని తన యాఖరి తమ్ముని యందు కూర్మిచే
ఇమ్ముగ పిల్ల నిచ్చి తన యింటికి అల్లుని చేయు కోర్కెతో
అమ్మతనంబునన్ పలుక యాతని రూపుకు మెచ్చి మాతకున్
తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై
పై రెండు పూరణలు "సాహితీ స్రవంతి" జూలై - ఆగస్టు సంచికలో ప్రచురింప బడ్డాయి.