ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

తెలుగు వెలుగు

అమ్మ పాడిన లాలి పాట నాన్న నేర్పిన మొదటి మాట
చదువు చెప్పిన గురువులంతా చేయెత్తి చూపిన వెలుగుబాట
                     అంతా తెలుగే అందమైన వెలుగే


ఆదికవి నన్నయ్య రాసిన ఆంధ్ర భారతము
భక్తకవి పోతన్న చిలికిన కృష్ణ నవనీతం
అన్నమయ్య తనివార పాడిన శ్రీ పదార్చనము
ప్రజాకవి వేమన్న విరచిత నిత్య జీవన వేదము
                     అంత తెలుగే అందమైన వెలుగే


చాటు పద్య వైభవం శ్రీనాధుని ప్రాభవం
అష్ట దిగ్గజ కవుల మహిమ కృష్ణ రాయల కీర్తి గరిమ
కనకాభిషేకాలు గండపెండేరాలు
పల్లకి సేవలు గజరాజు హౌదాలు
                     అంతా తెలుగే అందమైన వెలుగే



శ్రీరంగం అభ్యుదయం గుడిపాటి స్వేచ్చావాదం
కృష్ణ శాస్త్రి లాలిత్యం కరుణశ్రీ పుష్ప విలాపం
విశ్వనాథుని విశ్వరూపం వేయిపడగల జ్ఞాన పీఠం
సమగ్రాంధ్ర సాహిత్యం తెలుగు భారతి కంఠ హారం
                     అంతా తెలుగే అందమైన వెలుగే


అన్నదమ్ములు వేరైనా అమ్మ ప్రేమ మారదు
ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి మారదు
అమృతానికి తీపి నేర్పిన అమ్మ ప్రేమనుతలచుకో
తేనేలాంటి తెలుగు భాషను గుండె నిండా దాచుకో